ఈ గ్రామం పడే కష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


ఈ గ్రామం పడే కష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు


           ప్రపంచంలోనే అతి ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే గ్రామంగా ఈ ప్రాంతం గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. మరి ఆ ప్రాంతం ఎక్కడ ఉంది? అతిగా పడే ఆ వర్షాల వలన వారు ఎలా జీవిస్తారు మొదలగు విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
                మేఘాలయలోని తూర్పు ఖాసీ జిల్లాలో ఉన్న మాసిన్రమ్‌ గ్రామంలోనే వర్షపాతం అధికంగా ఉంటుంది. ఈ గ్రామంలో ఏడాదికి సుమారు 11,873 మి.మీల వర్షం కురుస్తుందట అందుకే, ప్రపంచంలోనే అతి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది.  ఈ పట్టణం చుట్టూ ఉండే ఖాసీ కొండలు మేఘాలను అడ్డుకోవడంతో అవి మాసిన్రమ్‌లో వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇక, ఎండలు ఎక్కువగా ఉన్నపుడు పక్కనే ఉన్న బంగాళాఖాతంలో నుంచి పైకొచ్చిన ఆవిరి ఈ కొండల మధ్యకొచ్చేసరికి చల్లబడి వర్షంగా పడుతోంది. అలా ఇక్కడ ఏటా ఏప్రిల్‌ లేదా మేలో వర్షాకాలం ప్రారంభమై అక్టోబర్‌ వరకూ ఉంటుంది. వానల నుంచి విరామం దొరికేది శీతాకాలం నడిచే డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మాత్రమే. ఆ సమయంలోనే వర్షాకాలంలో ఇంట్లోకి అవసరమైన ధాన్యం, పప్పులతో పాటు ఇతర వంట దినుసులూ కట్టెల్లాంటి వాటినన్నిటినీ సన్నద్ధం చేసుకుంటారు. ఉష్ణోగ్రత ఎప్పుడూ పదీ ఇరవై డిగ్రీలకు మించని మాసిన్రమ్‌లో వెచ్చదనం కోసమూ బట్టలు ఆరబెట్టుకునేందుకూ ఇంట్లో ఎప్పుడూ కట్టెల పొయ్యి మండాల్సిందే. ఇక్కడ ఇంటి పైకప్పుల్ని సిమెంటూ రాళ్లతో కడితే నీటిని పీల్చి అవి మరింత బరువెక్కి ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి, చాలామంది పైకప్పు మీద వేసేందుకు రేకుల్నే వాడతారు. కానీ వాటి మీద భారీ వర్షం పడిందా శబ్దం చెవులు చిల్లులు పడేంతగా వస్తుంది. ఆ సమస్యకు నివారణగా వానాకాలం రావడానికి ముందే ఇళ్లపైన గడ్డిని పరుస్తారు.
            ఖాసీ హిల్స్‌ ప్రజలు స్థానికంగా ఎక్కువగా దొరికే వెదురు చెట్ల బద్దలూ చీపురు గడ్డినీ ఉపయోగించి 'నప్‌'లనే ఒకరకం గొడుగుల్ని తయారు చేసుకుంటారు. తలకు తగిలించుకునేలా ఉండే వీటిని చేత్తో పట్టుకోవాల్సిన పనిలేదు. కాబట్టి, పొలం పనుల్ని సులభంగా చేసుకోవచ్చు. వర్షాకాలంలో మాసిన్రమ్‌ మహిళల ఉపాధీ కాలక్షేపం కూడా ఈ నప్‌లూ వెదురు బుట్టల్ని అల్లడమే. చల్లదనం అవసరమైన తమలపాకులూ మిరియాల పంటల్నీ ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగుచేస్తారు. ఇక్కడ వర్షం ఒక్కోసారి ఏడు, తొమ్మిది, పన్నెండు రోజుల పాటు ఆగకుండా కురుస్తూనే ఉంటుందట. అందుకే, స్థానికుల మాటల్లో తొమ్మిది రోజుల వర్షం, పన్నెండు రోజుల వర్షం లాంటి పదాలు వినిపిస్తుంటాయి. ఇక, భారీ వర్షాల కారణంగా ఉప్పొంగే నదీపాయల్ని దాటేందుకు ఖాసీ ప్రజలు ప్రకృతి సహాయంతో వంతెనలు నిర్మించుకోవడం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నదీ పాయలకు అటువైపూ ఇటువైపూ ఉండే రబ్బరు చెట్ల వేళ్లను ఒకదాంతో ఒకటి అల్లుకునేలా పెనవేయడం వీరి ప్రత్యేకత. రెండుమూడేళ్లకు అవి దట్టంగా అల్లుకుని వంతెనలా ఏర్పడతాయి. చాలా దృఢంగా ఉండే వీటిని చూడ్డానికి విదేశాల నుంచి కూడా పర్యటకులు వస్తుంటారు.
             మాసిన్రమ్‌లో బడి పిల్లలకి వేసవి సెలవులుండవు. బదులుగా వానాకాలం సెలవులిస్తారు. 'వానలు బాగా పడుతున్నపుడు పాఠశాలకు రావడం ఇబ్బంది. వాన శబ్దానికి తరగతిలో పాఠాలు వినిపించవు. కరెంటూ సరిగా ఉండదు. అందుకే, భారీ వర్షాలు కురుస్తున్నపుడు సెలవులిస్తారు. వాన పూర్తిగా ఆగినపుడు పిల్లలు ఆడుకునేందుకు బడులు మూతబడతాయి' అంటారు స్థానికులు. అన్నింటికన్నా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే... భూమ్మీద అతి ఎక్కువ వానలు నమోదయ్యే మాసిన్రమ్‌లో వర్షాలు పడని మూడు నాలుగు నెలలూ గుక్కెడు నీటికోసం అష్టకష్టాలూ పడతారు ప్రజలు. ఎటుచూసినా ఏటవాలుగా రాతినేలలు ఉండే ఈ చోట వర్షాకాలం వస్తే ప్రతి వీధిలోనూ ఎగసిపడే జలపాతాలు కనువిందు చేస్తాయి. కానీ, ఆ రాతి నేలలు నీటిని పీల్చకపోవడంతో నీరు దిగువ ప్రాంతాలకు వెళ్లిపోతుంది. దాంతో పైపులైన్ల ద్వారా ఉదయం సాయంత్రం కొద్దిసేపు వచ్చే నీటిని ఉపయోగించుకుంటారు.
           ఇంతటి కష్టాలను పడే ఈ గ్రామా ప్రజల గురించి ఇప్పటివరకు మన దేశంలో  చాల మందికి ఈ విషయం తెలీదు.






Post a Comment

0 Comments