మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాల


మన దేశంలో కాకుండా వేరే దేశాల్లో ఉన్న హిందూ దేవాలయాల గురించి మీకు తెలుసా?



                    భారతదేశం అంటే గుడులు, గోపురాలు ఎక్కువగా ఉండే ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని చెప్పవచ్చు. మన పురాణాలను గుర్తుచేసుకుంటూ అనేక ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. అయితే మన దేశంలో కాకుండా వేరే దేశాలలో కూడా అక్కడ ఉండే మన దేశ ప్రజలు వారి భక్తిని చాటుకుంటూ విదేశాల్లో కూడా ఆలయాలను నిర్మించారు. మరి ఆ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
        
శ్రీ స్వామినారాయణ్‌ మందిర్‌:
                 ఈ మందిర్‌ను లండన్‌ వాయవ్య ప్రాంతంలో 1995లో నిర్మించారు. 2,828 టన్నుల బల్గేరియన్‌ లైమ్‌స్టోన్‌ను, 2వేల టన్నుల ఇటాలియన్‌ మార్బుల్‌ను వినియోగించారు. రూ.82 కోట్లను ఖర్చు చేశారు. నిర్మాణానికి రెండున్నరేళ్లు పట్టింది. దీనిని నీస్‌డెన్‌ ఆలయంగా పిలుస్తారు. ఇది ఐరోపాలో నిర్మించిన మొదటి అధికారిక ఆలయం. ఇది భారత్‌కు వెలుపల నిర్మించిన అతిపెద్ద ఆలయంగా 2000 సంవత్సరంలో గిన్నిస్‌ రికార్డులకెక్కింది. లండన్‌లోని ఏడు అద్భుతాల్లో ఇదీ ఒకటని చెబుతారు.

వెంకటేశ్వర ఆలయం, బర్మింగ్‌హాం:
                   బ్రిటన్‌ వెస్ట్‌ మిడ్‌లాండ్‌లోని డబ్లీకి సమీపంలో ఉన్న టివిడేల్‌లో నిర్మించిన వెంకటేశ్వరాలయం మరో అద్భుత కట్టడం. రూ.40 కోట్ల వ్యయంతో 12.5 ఎకరాల్లో దీనిని నిర్మించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం నమూనాలో దీనిని కట్టారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు సమీపంలో 1981లో శాంటా మోనికా కొండల్లో ఈ మలీబు ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శ్రీనివాసుడు సేవలందుకుంటారు. ఇందులో రెండు ప్రాంగణాలున్నాయి. పైన ఉన్న ఆలయంలో వెంకటేశ్వరుడు కొలువుదీరి ఉంటారు. కిందిభాగంలో శివాలయం ఉంది.

స్వామి నారాయణ్‌ మందిర్‌, టొరంటో:
                    కెనడాలోని టొరంటోలో రూ.64 కోట్లతో నిర్మించిన స్వామి నారాయణ్‌ మందిరానికి 2వేల మంది కార్మికులు పనిచేశారు. టర్కీ లైమ్‌స్టోన్‌, ఇటలీ మార్బుల్‌తో నిర్మించారు. 2007లో ఈ ఆలయం ప్రారంభమైంది.

సనాతన్‌ హిందూ మందిర్‌:
           హిందువులు అధికంగా నివశించే లండన్‌లోని వెంబ్లీ ప్రాంతంలో ఈ 'సనాతన్‌ హిందూ మందిర్‌'ను 2.4 ఎకరాల్లో నిర్మించారు. ఆలయం ఎత్తు 66 అడుగులు. ఆలయ నిర్మాణంలో పురాతన 'శిల్పశాస్త్ర' కళను అనుసరించారు. ఆలయానికి ఉపయోగించిన లైమ్‌స్టోన్‌ను ప్రత్యేకంగా గుజరాత్‌లోని సోలా పట్టణంలో అద్భుత శిల్పాలుగా మలిచారు. మందిర నిర్మాణంలో స్టీల్‌ను వాడకపోవడం విశేషం. ఈ మందిరంలో మతాలకు అతీతంగా 41 మంది పాలరాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో మదర్‌ థెరెసా, గురునానక్‌, మీరాబాయి, స్వామినారాయణ్‌ తదితరుల విగ్రహాలున్నాయి.
                ఈవిధంగా విదేశాల్లో ఉండే భారతీయులు అక్కడి దేవాలయాల్లో పూజలు చేస్తూ వారి భక్తిని చాటుకుంటున్నారు.


 వేపచెట్టు కింద వెలసిన గండి మైసమ్మ ఆలయం విశేషాలు


                  ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారని ప్రతీతి. అమ్మవారు వెలసిన శక్తివంతమైన ఆలయాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ ఆలయం ఎక్కడ వెలసింది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

                    తెలంగాణ రాష్ట్రంలోని, మహబూబ్ నగర్ జిల్లాలోని, ఆమనగల్లు మండలం, హైదరాబాద్ నుండి సుమారు 50 కీ.మీ. దూరంలో కర్నూలు వెళ్లే రహదారిలో మైసిగండి అనే గ్రామంలో గండి మైసమ్మ  ఆలయం ఉంది. ఈ ప్రాంతంలో ఒక వేప చెట్టు క్రింద బురుజు గోడలో స్వయంభువుగా మైసమ్మ తల్లి వెలసింది. ఈ తల్లి కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలసిందిగా పురాణాలూ చెబుతున్నాయి.

             ఈ గ్రామంలోని ప్రజలు ఈ తల్లిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఈ మైసమ్మ చుట్టూ పక్కల గ్రామాలలోని ప్రజలందరికి ఆరాధ్య దైవంగా పూజలందుకొనుచున్నది. భక్తుల పాలిట కొంగుబంగారమై కోరిన కోరికలు తీర్చే అమ్మగా ఈమెను కొలుస్తారు. ఈ ఆలయంలో సృష్టి స్థితి లయకారిణి అయి కాళికాదేవి స్వరూపంతో పూజలనందుకొంటుంది.

                మైసమ్మను అర్చించినవారు సుఖసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారనే గొప్ప నమ్మకం ఈ ప్రాంత ప్రజల్లో బలంగా ఉంది. మైసమ్మ విగ్రహం ప్రతిష్టించక ముందు ఇక్కడ చిన్న శిలావిగ్రహం ఉండేది. కొంతకాలం తరువాత ఒక భక్తుడు ఈ మైసమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు తెలుస్తుంది.

                 మైసమ్మ దేవాలయానికి కొంత దూరంలో శివాలయం, రామాలయం, అన్నపూర్ణేశ్వరి దేవాలయాలు ఉన్నాయి. ఈ ప్రాచీన దేవాలయాలను గోల్కొండను పాలించిన తానిషా వద్ద మంత్రులుగా పనిచేసిన అక్కన్న, మాధన్నలు నిర్మించినట్లుగా చెబుతారు. అయితే ఈ ఆలయాలకు ఎదురుగా ఒక గండి (కోనేరు) ఉంది. ఈ గుడికి ఎదురుగా మైసమ్మ ఉన్నందున ఈ ప్రాంతానికి మైసిగండి అనే పేరు స్థిరపడింది.

              ప్రతి ఆదివారం, గురువారాలలో వేల సంఖ్యలో భక్తులు ఈ మైసమ్మను దర్శిస్తుంటారు. అన్నివర్గాల ప్రజలచే నిత్యం పూజలు అందుకుంటూ ఈ దేవత మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రతి ఏటా ఇక్కడ జరిగే జాతరకు భక్తులు విశేషంగా వస్తారు. 

 ఉడిపిలో వెలసిన బాలకృష్ణుడి ఆలయ రహస్యం

             శ్రీ కృషుడి ఆలయాలలో ఇది చాల ప్రత్యేకం. ఎందుకంటే ఈ ఆలయంలోని మూలవిరాట్టు బాలకృష్ణుడు. అంతేకాకుండా భూలోక వైకుంఠంగా ఈ ఆలయాన్ని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? బాలకృష్ణుడు ఇక్కడ ఎలా వెలిశాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

             కర్ణాటక రాష్ట్రము దక్షిణ కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉడిపి అనే పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఉడుప అనే మాట నుంచి ఈ ఉరికి ఉడిపి అనే పేరు వచ్చింది. ఉడుప అంటే చంద్రుడు. తన మామగారైన దక్ష ప్రజాపతి వల్ల శాపం పొందిన చంద్రుడు ఇక్కడ చంద్రపుష్కరి అనే పేరు ఉన్న తటాకం ప్రక్కన చంద్రమౌళీశ్వరుని గూర్చి తపస్సు చేసి శాపవిమోచనం పొందాడని స్థలపురాణం. ఈ ఆలయం 13 వ శతాబ్దం నాటిది అని తెలుస్తుంది. ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం ద్వాపరయుగం నాటిదిగా ప్రతీతి. ఈయన ఒక చేతిలో త్రాడు, మరొక చేతిలో కవ్వముతో వివిధ ఆభరణములు ధరించి దివ్య మంగళ రూపంతో భక్తులకి దర్శనమిస్తున్నాడు.

             మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. 

         ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు.

             చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత హనుమంతుడు, వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది.  ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

              ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి రోజుకి  9 సార్లు అర్చనలు జరుగుతాయి. కిలో బంగారం, మూడువేల వజ్రాలు, ఇతర విలువైన రాళ్లతో తయారైన కిరీటం శ్రీ కృషుడికి అలంకరిస్తారు.

                ఈవిధంగా ఉడిపిలో వెలసిన బాలకృష్ణుడికి మేధ్యసరోవరం అనే పేరుగల ఉత్సవం చాలా గొప్పగా జరుగుతుంది.






















Post a Comment

0 Comments